గ్రేట్‌ ఇండియన్‌ కామెడీ షో(బాబు ఒక మునిగిపోతున్న నావ).

  • Jmr ప్రతినిధి, న్యూఢిల్లీ: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనపై రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. దేశాన్ని కాపాడే ఉద్దేశంతో ‘సేవ్‌ కంట్రీ.. సేవ్‌ డెమొక్రసీ’ నినాదంతో ఢిల్లీకి వచ్చానని చంద్రబాబు చెబుతున్నా.. ఆయన ఢిల్లీ రాక వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత భారీ స్థాయిలో పాల్పడిన అవినీతిపై దర్యాప్తు సంస్థల విచారణ తప్పదేమోనన్న భయంతో ఉన్న చంద్రబాబు.. అలాంటి విచారణ ఏదీ జరగకుండా చూసే దిశగా చేసిన ఆలోచనే ఈ బీజేపీ వ్యతిరేక కూటమి అని భావిస్తున్నారు. స్వీయ రక్షణే ఆయన పర్యటన రహస్య లక్ష్యమని అనుకుంటున్నారు. మరోవైపు, యలబాబు వ్యాఖ్యలు, చేతలను ‘గొప్ప కామెడీ షో’గా కొందరు అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసి, మోదీని మట్టి కరిపిస్తానని చెబుతున్న బాబుకు.. కాంగ్రెస్‌ నేతృత్వంలో, బీజేపీ వ్యతిరేక కూటమి యూపీఏ(యునైటెడ్‌ ప్రొగ్రెసివ్‌అలయన్స్‌) పేరుతో ఇప్పటికే ఉందన్న విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

దేశవ్యాప్తంగా వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలు యూపీఏలో భాగస్వాములుగా ఉన్న విషయం, కొన్ని పార్టీలు స్థానిక కారణాల దృష్ట్యా ఏ కూటమిలోనూ చేరకుండా ఒంటరిగానే నిలిచిన విషయం బాబుకు తెలియదేమోనని వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీజేపీ వ్యతిరేక కూటమిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ‘నక్క బుట్టి నాలుగు రోజులు కాలేదు.. ఇంత జడివాన నా జీవితంలో ఇంతవరకు చూడలేదు అందట’ అంటూ బాబు పర్యటనపై కొన్ని మీడియా సంస్థలు చేసిన హడావుడి చూసిన తెలుగువాడైన ఒక సీనియర్‌ నేత చతురోక్తి కూడా విసిరారు. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని స్వయంగా కలిసి యూపీఏలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవడం కూడా బాబు ఢిల్లీ పర్యటన వెనుక మరో కారణమనే వ్యాఖ్య కూడా ఢిల్లీలో చక్కర్లు కొడుతోంది.

బాబు.. ఓ మునిగిపోతున్న నావ
చంద్రబాబును మునిగిపోతున్న నౌకతో ఒక బీజేపీ సీనియర్‌ నేత పోల్చారు. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి బాబుదన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించబోతోందంటూ సీ ఓటర్‌ తదితర జాతీయ సర్వేలు స్పష్టంగా చెబుతున్న పరిస్థితుల్లో.. చివరి ప్రయత్నంగా కాంగ్రెస్‌ చెయ్యి అందుకునేందుకు బాబు ఆరాటపడుతున్నారని విశ్లేషించారు.

రాష్ట్రంలో ఓట్లశాతంలో పోలిస్తే వైఎస్సార్సీపీతో టీడీపీ దాదాపు 10% నుంచి 15% వెనకబడి ఉన్నట్లు అనేక సర్వేల్లో తేలిందని, ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మిగిలిన అరకొర ఓట్లను టీడీపీ ఖాతాలో వేసుకోవాలన్న ఆలోచన బాబుదని ఆయన వివరించారు. ‘సేవ్‌ కంట్రీ.. సేవ్‌ డెమోక్రసీ’ అంటూ తాను దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయిలో పాటుపడుతున్నానని తన అనుకూల మీడియా సాయంతో ప్రచారం చేసుకుని రాష్ట్రంలో మరికొన్ని ఓట్లు పొందాలనేది కూడా బాబు ప్రణాళికగా పేర్కొన్నారు. అన్యాయంగా, అక్రమంగా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ అని, ఆ పార్టీని బాయ్‌కాట్‌ చేయాలని ఇన్నాళ్లూ ప్రతీ సందర్భంలో తాను తిట్టిపోసిన కాంగ్రెస్‌ పార్టీకే ఇప్పుడు నిస్సిగ్గుగా దగ్గర కావడం చంద్రబాబు విలువల లేమికి మరో ఉదాహరణ అని వివరించారు.

అయితే, బాబు– రాహుల్‌ దోస్తీ టీడీపీ కన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ లాభదాయకమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు పడడం ద్వారా విజయావకాశాలను కాంగ్రెస్‌ మెరుగుపర్చుకుందని విశ్లేషించారు. కాంగ్రెస్‌ నేతలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. తన సొంత రాజకీయ అస్తిత్వం కోసమే చంద్రబాబు తమ వద్దకు వచ్చాడని తేల్చి చెబుతున్నారు. ‘తెలంగాణలోని టీడీపీ ఓట్ల కోసమే రాహుల్‌ చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు కానీ.. లేదంటే అసలు పట్టించుకునేవారే కాదు’ అని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు
బాబు కింగ్‌ మేకర్‌ అంటూ యెల్లో మీడియా చేస్తున్న ప్రచార మాయలో పడిన చంద్రబాబు అదే హ్యాంగోవర్లో ఇంకా ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీ నేతగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నానన్న భ్రమల్లో ఆయన ఉన్నారని, నిజానికి జాతీయస్థాయి నేతల్లో ఎవరు కూడా ఆయనను సీరియస్‌గా తీసుకోవడం లేదన్నదే అసలు వాస్తవమని కుండబద్ధలు కొట్టారు. బాబుతో పోలిస్తే.. టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ, బీఎస్పీ చీఫ్‌ మాయావతి.. జాతీయ స్థాయిలో బలమైన నేతలని గుర్తు చేశారు.

నాడు అసలు కింగ్‌ మేకర్‌ సూర్జిత్‌
చంద్రబాబు ఢిల్లీ వచ్చాకే బీజేపీ వ్యతిరేక కూటమికి రంగం సిద్ధమైందంటూ యెల్లో మీడియా చేస్తున్న ప్రచారం, ‘అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు.. నేనే కింగ్‌ మేకర్‌ని’ అంటూ బాబు చెప్పే మాటలు ఢిల్లీ రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నిజానికి 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనుక వ్యూహరచన నాటి సీపీఎం సీనియర్‌ నేత హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌దేనని వారు గుర్తు చేశారు. దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌లను కింగ్స్‌ను చేసిన అసలు కింగ్‌ మేకర్‌ సూర్జితేనని స్పష్టం చేశారు. ‘నాటి చర్చోపచర్చల్లో తనకు సహాయకారిగా చిన్నవాడైన చంద్రబాబును నియమించుకున్న సూర్జిత్‌.. బాబుకు యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ పదవిని అప్పగించాడు. దాంతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నానన్న భ్రమల్లో బాబు మునిగిపోయాడు.

అందుకు తగ్గట్టు అనుకూల యెల్లో మీడియా అదే విషయాన్ని పదేపదే చెప్పసాగాయి. అంతేకాని, నాటి రాజకీయాల్లో చక్రం తిప్పింది.. కింగ్‌ మేకర్‌గా వ్యవహరించింది సీనియర్‌ కమ్యూనిస్ట్‌ హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ మాత్రమే’ అని నాటి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత ఒకరు తేల్చి చెప్పారు. వాజ్‌పేయి హయాంలోనూ టీడీపీకున్న 36 మంది ఎంపీల మద్దతు కోసమే బాబుకు అనుకూలంగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత నాలుగేళ్లుగా అంటకాగుతున్నా.. మోదీ కనీసం పట్టించుకోని విషయాన్నీ ప్రస్తావించారు. అంతేకాక, బీజేపీతో నాలుగేళ్ల బంధం కారణంగా లౌకికవాదనేతగా చెప్పుకునే విశ్వసనీయతను కూడా ఆయన కోల్పోయారన్నారు.