జగన్‌పై హత్యాయత్నం: సీఎం చంద్రబాబుకు నోటీసులు .

JMRTV హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్‌పీ ఠాకుర్‌లతో సహా మరో 8 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటిపై రెండు వారల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలపాటు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈ రెండు వారాల విచారణ రిపోర్ట్‌ను సీల్డ్‌కవర్‌లో మరోసారి సమర్పించాలని సిట్‌ అధికారులను ఆదేశించింది.

అక్టోబర్‌ 25న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మరో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్లను విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం.. సిట్‌ దర్యాప్తు పురోగతిపై తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని, సిట్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారి, ఆ బృందంలో ఉన్న ఇతర పోలీసు అధికారుల వివరాలను కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు సిట్‌ అధికారులు మంగళవారం హైకోర్టుకు తమ నివేదికను సమర్పించారు.

ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌ సీసీ టీవీ ఫుటేజ్‌ వివరాలు ఏమయ్యాయని ధర్మాసనం అధికారులను ప్రశ్నించింది. గత మూడు నెలలుగా సీసీ టీవీ ఫుటేజ్‌ లేదని అధికారులు తెలపడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీసీటీవీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉందనే విషయంపై కూడా సిట్‌ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ భద్రతా లోపాలు క్షమించారానివని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. హత్యాయత్నం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్‌పీ ఠాకుర్‌ వ్యాఖ్యలను వైఎస్‌ జగన్ తరుపు న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సినీ హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంశాన్ని కూడా వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం రిట్‌పిటీషన్‌లో పేర్కొన్న ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.