నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్!!!

JMRTV సిద్దిపేట : గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు.సెంటిమెంట్లకు,జాతకాలు, ముహూర్తాలకు ప్రాధాన్యత ఇచ్చే సీఎం కేసీఆర్‌..గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా తన ఇష్టదైవం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ముందుగా కేసీఆర్‌ బీ ఫారంపై సంతకం పెట్టి,అనంతరం దానికి పూజారులు గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ముహుర్తం ప్రకారం మధ్యాహ్నం 2.34 గంటలకు అందజేశారు.

బుధవారం కోనాయిపల్లికి సీఎం కేసీఆర్‌తోపాటు,మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా వెళ్లి తన బీ ఫారంకు పూజలు చేపించారు.హరీశ్‌రావు మందుగా హైదరాబాద్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆశీర్వచనాలు తీసుకొని,ఆ తర్వాత కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.అనంతరం కోనాయిపల్లిలో పూజలు చేయించిన బీ ఫారం తీసుకొని నేరుగా సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.అక్కడ అర్చకులు, పూజారులు,హిందూ మత పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు.అక్కడి నుండి గద్దెబొమ్మ సమీపంలోని పెద్ద మసీద్‌లోకి వెళ్లి హరీశ్‌రావు ప్రార్థనలు నిర్వహించి ముస్లీం పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఆ తర్వాత నేరుగా చర్చికి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని అక్కడ క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నారు.అనంతరం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు.