చంద్రబాబు తెలివైనవారు:మాజీ సీఎం కిరణ్ పొగడ్తలు !!!!

JMRTVఅనంతపురం:రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు శాశ్వత శత్రువులు ఉండరంటారు.అది కాంగ్రెస్, టీడీపీల పొత్తుతో నిజమని తేలిపోయింది.రాజకీయాల్లో విభిన్న ధృవాలైన కాంగ్రెస్,టీడీపీల కలయిక సరికొత్త రాజకీయాలకు నాంది పలికింది.దీంతో ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి.

ఏపీలో బద్ధశత్రువులుగా ఉన్న కాంగ్రెస్,టీడీపీలు ఏకమయ్యాయి.మాజీముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నిత్యం చంద్రబాబు నాయుడిని తిట్టడమే పనిగా పెట్టుకునేవారు.అభివృద్ధికి అడ్డంకిగా చంద్రబాబు మారారంటూ తీవ్ర విమర్శలు చేసేవారు.

అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి పొత్తుల ప్రభావంతో చంద్రబాబు చాలా తెలివైన వారంటూ కితాబిచ్చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు.చంద్రబాబు చాలా తెలివైన వ్యక్తి అంటూ కితాబిచ్చారు.అనంతపురం జిల్లాలో పర్యటించిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే విభజన హామీలు సాధ్యమని స్పష్టం చేశారు.

నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్రభుత్వం ఏమీ చెయ్యలేదని ఆరోపించారు.ఇప్పటి వరకు కేంద్రం చేసింది శూన్యమంటూ విమర్శించారు.రాష్ట్రానికి మేలు జరుగుతుందనే చంద్రబాబు కాంగ్రెస్ తో కలిశారని వివరించారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యాలని పరితపించే వారని అది ఆయన కల అంటూ వ్యాఖ్యానించారు.ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీకి మద్దతు ఇస్తారో కాంగ్రెస్ మద్దతు ఇస్తారో వైసీపీ, జనసేనలు తేల్చుకోవలన్నారు.ఏ జట్టులో ఉండాలనుకుంటున్నాయో ఆ పార్టీలే నిర్ధారించుకోవాలన్నారు.