ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ !!!


JMRTV అమరావతి: రాష్ట్రంలో సీబీఐకి సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ‘సమ్మతి’ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.గతంలో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను విత్‌ డ్రా చేసుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది.అయితే ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేయడంలో రాష్ట్రంలో దాడులు,దర్యాప్తు చేసేందుకు సీబీఐ పరిధి రద్దు అయినట్టు పేర్కొంది.రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించడానికి కూడా సీబీఐకి అధికారం ఉండదు.తద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా రాష్ర్ట ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది.కాగా,చంద్రబాబు సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోంది.

అనుమానాలకు తావిస్తున్న ప్రభుత్వ నిర్ణయం..
దేశంలో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిందని పైకి చెబుతున్నప్పటికీ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.అసలు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో ఏ మేరకు న్యాయబద్ధమైనది అనే విషయంపై పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలు తన అనుచరులపై దాడి చేస్తే..దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడాన్ని నిరాకరిస్తూ జీవో జారీ చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతున్నారు.

సీబీఐ అంటే చంద్రబాబుకు ఎందుకు భయం?
అంతే కాకుండా రాష్ట్ర ప్రతిపక్షనేత,వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై కేంద్ర ప్రభుత్వ సంస్థలచే దర్యాప్తు చేయాలని ఆ పార్టీ పోరాడుతున్న సంగతి తెలిసిందే.ఇందుకోసం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు,రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి తమ డిమాండ్‌ను వారి దృష్టికి తీసుకెళ్లారు.హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి,డీజీపీకి నోటీసులు జారీ చేసింది. కేంద్ర సంస్థలచే విచారణ జరిపితే చంద్రబాబు లోసుగులు బయటపడతాయనే భయంతో,కేసును పక్కదారి పట్టించాలనే ఆలోచనతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.అలాగే చంద్రబాబు సీబీఐ అంటే ఎందుకు భయపడుతున్నారని విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి.

ఒకప్పుడు సీబీఐని కీర్తించిన చంద్రబాబు..ఇప్పడు సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి లేదంటూ నిర్ణయం తీసుకోవడం మారోమారు ఆయన అవకాశవాదాన్ని తెలియజేస్తుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని కేంద్ర సంస్థలు నిగ్గు తెలుస్తున్న వేళ..ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ విషయంలో ఈ విధంగా వ్యవహారించడం వల్ల ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసిన విషయాన్ని కూడా కేవలం అనుకూల మీడియాకు మాత్రమే తెలుపడాన్ని గమనిస్తే..దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.