‘ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా?’

JMRTV హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి ప్రజలను నిలువునా ముంచారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో చంద్రబాబు నాయుడు 2014 మేనిఫెస్టోను అమలు చేయలేదని తెలిపారు.ఏపీలో రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో..వారు రోడ్డున పడ్డారని వ్యాఖ్యానించారు.ఏపీలో డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు..వడ్డీలు కూడా కట్టలేదని ఆరోపించారు.టీడీపీ మేనిఫెస్టోపై ఏపీ కాంగ్రెస్‌ విడుదల చేసిన చార్జ్‌షీట్‌ను ఆయన మీడియాకు చూపెట్టారు. ఏపీలో హామీలు అమలు కావడం లేదని కాంగ్రెస్‌ పార్టీ వారం రోజులు ‘ప్రజావంచన వారం’ పేరుతో నిరసన దీక్షలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అని ప్రశ్నించారు.

టీడీపీ మిత్రపక్షమైన కాంగ్రెస్సే చంద్రబాబు పాలన వైఫల్యాలను ఎత్తిచూపిందని అన్నారు. ఏపీ కాంగ్రెస్‌కు నచ్చని చంద్రబాబు టీ కాంగ్రెస్‌కు ఎలా నచ్చారో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలన్నారు.నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబుని నిలదీశారు.చంద్రబాబును ఓడించాలని అక్కడి రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.ఏపీ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు.ఏపీలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పిన తరువాతే చంద్రబాబు తెలంగాణలో తిరగాలన్నారు.

గతంలో టీడీపీ,కాంగ్రెస్‌లు తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు.కాంగ్రెస్‌,టీడీపీ చేయలేనివి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు.వారిది ప్రజా కూటమి కాదని..దగా కూటమి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ అమలు చేశారని తెలిపారు. రాహుల్‌, చంద్రబాబు తెలంగాణ ప్రజల చెవ్వుల్లో పూలు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు చంద్రబాబు చేసిన అభివృద్ధి నిరోధక చర్యలను ప్రజలు మర్చిపోరని వ్యాఖ్యానించారు.అప్పులు తెచ్చిన విషయంలో చంద్రబాబుతో చర్చకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. మహాకూటమిలో తెలంగాణ జనసమితి కోదండరాం టికెట్‌ దక్కలేదని,అలాంటి కోదండరాంకు తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయి నమ్మకం ఉందన్నారు.రాహుల్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

పొత్తులపై చంద్రబాబును నిలదీసిన హరీశ్‌
చంద్రబాబు నాయుడు 2014లో మోదీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రక అవసరం అన్నారు..ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలవడం చారిత్రక అవసరం అంటున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తొలుత చంద్రబాబు జన్మనిచ్చిన కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని..ఆ తర్వాత పున​ర్జన్మనిచ్చిన మామ(ఎన్టీఆర్‌)ను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎప్పుడైన చంద్రబాబు తన అవసరం కోసమే మాట్లాడతారని దుయ్యబట్టారు.