తెలంగాణ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఖర్చు ఓటింగ్‌ శాతం పెరిగింది.. మీడియాతో లగడపాటి ….


లగడపాటి సర్వే: ప్రజాఫ్రంట్‌దే అధికారం !

 JMRTV LIVE  హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారం చేపట్టబోయేది కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాఫ్రంటేనని ఆ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. గతంలో ప్రకటించిన విధంగా ఆయన ఎన్నికల అనంతరం తన సర్వే వివరాలను వెల్లడించారు. ఓవైపు జాతీయ చానెల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కేసీఆర్‌కు పట్టం కట్టగా.. లగడపాటి మాత్రం కూటమిదే అధికారమని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు 8 నుంచి 10 మంది అభ్యర్థులు గెలుస్తారని, పోలింగ్‌ శాతం తగ్గితే హంగ్‌ వస్తుందని బాంబు పేల్చిన లగడపాటి.. ప్రజలనాడీ హస్తం వైపే ఉందని హింట్‌ ఇచ్చారు.

ఇండిపెండెంట్లు ఏడుగురు…
తమ ఆర్జీ ఫ్లాష్‌ టీం సెప్టెంబర్‌ నుంచి ఇప్పటివరకు అనేక పర్యాయాలు ప్రజల నాడి, మనోభావాలు, వారు ఎటువైపు మొగ్గుచూపుతున్నారనే అంశాలపై సర్వే చేసిందని వెల్లడించారు. గత ఎన్నికల్లో 68.5 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈ రోజు తెలంగాణలో 72 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తమకు ఓ అంచనా ఉందని, రాత్రి 9గంటలకు పూర్తి పోలింగ్‌ నమోదు శాతం వచ్చే అవకాశం ఉందన్నారు. అధిక శాతం పోలింగ్‌ ఈసారి నమోదైందని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఖర్చు పెట్టారని, ప్రలోభాలకు గురిచేశారన్నారు. ఈ నేపథ్యంలో తను ముందుగా చెప్పినట్లు.. 8-10 మంది ఇండిపెండెట్లలో ఏడుగురు  గెలుస్తారన్నారు. ఈ సంఖ్యకు రెండు పెరగవచ్చు.. రెండు తగ్గవచ్చని కూడా చెప్పారు.

ఫ్రంట్‌ 55-75.. టీఆర్‌ఎస్‌ 25-45..
లగడపాటి లెక్క ప్రకారం కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌ 55 నుంచి75 సీట్లు గెలుస్తందన్నారు. టీఆర్‌ఎస్‌కు కేవలం 25- 45 మాత్రమే వస్తాయన్నారు. కూటమిలో భాగంగా 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీకి 5-9 సీట్లు వస్తాయని, బీజేపీకి 5-9, ఎంఐఎం 6-7, ఇతరులు 5-9 సీట్లు గెలుస్తారని జోస్యం చెప్పారు. బీఎల్‌ఎఫ్‌ కూడా ఖమ్మంలో ఒక సీటు గెలిచే అవకాశం ఉందన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో  ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ తప్పయ్యాయని, కానీ తాను చెప్పిన జోస్యం నిజమైందని గుర్తు చేశారు. ఇక ఈ ఎగ్జిట్‌ పోల్స్‌.. లగడపాటి సర్వే ఫలితాల్లో ఏవి నిజమో తెలియాలంటే.. ఫలితాలు వెలువడే డిసెంబర్‌ 11 వరకు వేచిచూడాల్సిందే.

admin