‘ఆయన సీఎం అవుతారని ఇంకా ప్రకటించ లేదు!!!!

న్యూఢిల్లీ : రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందబోతోందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో..  ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కాంగ్రెస్‌ అధిష్టానానికి తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్, కాంగ్రెస్‌లో కీలక నేత సచిన్‌ పైలట్‌లు ఈ సారి తొలి నుంచీ ముఖ్యమంత్రి ఆశావహులుగా ఉన్నారు. అయితే శనివారం ఒక టీవీ చానల్‌కు గెహ్లాట్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇందులో భాగంగా.. ‘సచిన్‌ పైలట్‌ సీఎంగా బాగా పనిచేయగలరా లేక ఆయనకు మరింత అనుభవం అవసరమని మీరు అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించగా, ‘ఇది ఊహాజనిత ప్రశ్న. ఆయన సీఎం అవుతారని ఇంకా కాంగ్రెస్‌ ప్రకటించలేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం పార్టీలో లేదు. ఆయన సామర్థ్యాలను నేను శంకించలేను. మీరు నన్ను ఈ ప్రశ్న అడగకూడదు’ అని గెహ్లాట్‌ వ్యాఖ్యానించారు. చాలా ప్రశ్నలకు సమాధానంగా ఆయన ‘అధిష్టానమే చూసుకుంటుంది. వారు నాకు ఏ పని చెబితే ఆ పని చేస్తాను. రెం‍డుసార్లు సీఎంగా, మూడు సార్లు కేంద్రమంత్రిగా అడగకుండానే నాకు అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా అంతే’  అని గెహ్లాట్‌ చెప్పుకొచ్చారు.

admin