ఓట్లపై నోట్ల వర్షం!!!!

JMRTVLIVE TELANGANA:-

ఏం చేస్తారో, ఎంత పంచుతారో తెలీదు.. నేను గెలవాలంతే! తన అనుచరులకు ఓ అభ్యర్థి ఆదేశం..అవతలి పార్టీ పంచినదానికి మరో వెయ్యి ఎక్కువే ఇవ్వండి.. ఎక్కడా తగ్గొద్దు. నేను గెలవాలంతే! మరో అభ్యర్థి తన మనుషులకు చేసిన సూచన..

ఇదీ తెలంగాణ ఎన్నికల్లో గెలిచేందుకు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న అభ్యర్థులు వ్యవహరించిన తీరు. ఏం చేసైనా గెలవాలన్న కసితో వీరు లెక్కలేకుండా డబ్బు పంచారు. ప్రచారం ముగిసేంత వరకు అయిన ఖర్చుతో సంబంధం లేకుండా.. పోలింగ్‌కు చివరి 36 గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా నోట్ల పంపిణీ వెయ్యికోట్లను దాటడం ఆశ్చర్యపరుస్తోంది. నువ్వెంతంటే నువ్వెంతనే రేంజ్‌లో ఒకరిని మించి మరొకరు ఖర్చుపెట్టారు. ఏరులై పారిన మద్యానికైతే లెక్కే లేదు. కేంద్ర పరిశీలకులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అబ్జర్వర్లు, స్క్వాడ్‌లు ఎందరున్నా యథేచ్ఛగా కోట్లకు కోట్లు రాత్రికి రాత్రే పంపిణీ అయ్యాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇలా జరుగుతున్న పంపిణీ మొత్తాన్ని చూసి.. పలుచోట్ల కొందరు అభ్యర్థులు ఏడ్వటమొక్కటే తక్కువైంది. అప్పటికే రూ.10 కోట్ల వరకు ఖర్చుపెట్టిన గ్రేటర్‌ హైదరాబాద్‌లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి.. తన అనుచరులతో ‘నా రక్తం తాగండ్రా’ అన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఈ ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా డబ్బులను మంచినీళ్ల ప్రాయంగా పంచిపెట్టారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులందరూ.. పోలింగ్‌కు 36 గంటల ముందు నోట్లతో ప్రజలను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. దీంతో ఒక్కో నియోజకవర్గంలో కనిష్టంగా రూ. 10కోట్లు మొదలుకుని.. రూ.45–50 కోట్ల వరకు ఖర్చులు దాటాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి ఆర్థిక స్థోమతను బట్టి కొన్ని చోట్ల ఓటుకు రూ.5 వేలు, అంతకంటే ఎక్కువ ఖర్చు చేశారు. కొన్నిచోట్ల ఓటుకు రూ.2,000 ఇస్తే.. మరికొన్ని చోట్ల రూ.500, రూ.300 కూడా పంచారు. పోలింగ్‌కు 36 గంటల ముందు తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయల కుపైగా పంపిణీ జరిగినట్లు ఓ అంచనా. అంతకు ముందు ప్రచార సమయంలో ఖర్చు చేసిన రూ.750 కోట్లు కలుపుకుంటే దాదాపుగా రూ.1,750 కోట్లు ఖర్చయినట్లు భావిస్తున్నారు.

రాజకీయ పార్టీలు ఖర్చు చేసిన మొత్తం దీనికి అదనం. మూడు వారాల పాటు సోషల్‌ మీడియా, పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా రాజకీయ పార్టీలు చేసిన ఖర్చు కలుపుకుంటే మొత్తం రూ.2 వేల కోట్లు దాటే ఉంటుందని.. ఎన్నికలను దగ్గర నుంచి పర్యవేక్షిం చిన ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధి వెల్లడించారు. విచ్చలవిడిగా డబ్బుల ఖర్చును నియంత్రించేందుకు నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ప్రేక్షక పాత్ర పోషించారని, స్వతంత్ర అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా.. ఈసారి ఖర్చుపె ట్టారని, రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీల మధ్య పోటీగా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందునే అభ్య ర్థులు డబ్బు వెదజల్లి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారని మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ పేర్కొన్నారు. భవిష్యత్‌లో సామాన్యు లెవ్వరూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని, ఇది ప్రజాస్వా మ్యానికి ద్రోహం చేయడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన ఎల్‌బీనగర్‌ నియోజకరవ్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.

ఆ నియోజకవర్గంలో రూ. 100 కోట్లు 
మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగినప్పటికీ.. పోలింగ్‌కు ముందే 110 నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరిగినట్లు సమాచారం. వీటిలో 30కి పైగా నియోజకవర్గాల్లో ఓటర్లకు రూ.300 నుంచి రూ. 500 వరకు అందజేశారు. మరో 40 నియోజకవర్గాల్లో అటు కూటమి, ఇటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీ పడి డబ్బు పంచారు. రూ.500 నుంచి రూ.1,000 పంపిణీ చేశారు. మరో 20 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, తీవ్రమైన పోటీ కారణంగా ఓటుకు రూ.2,000 నుంచి రూ.3,000 దాకా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 20 నియోజకవర్గాల్లో ఓటుకు రూ.5 వేలు అంతకంటే ఎక్కువే పంపిణీ జరిగింది. ‘నేను ప్రచారం ముగించుకుని కాసేపు సేద తీరాలనుకునేలోపే నా ప్రత్యర్థి రూ.2 కోట్లు పంపిణీ చేశారు.

అప్పటిదాకా నాతోనే తిరిగి ప్రచారం చేసిన పది మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చి ఆయన పార్టీ తరపున పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించుకున్నారు. నేను తేరుకుని రంగంలోకి దిగి ఓటుకు రూ.3వేల చొప్పున పంచాలని ఏర్పాట్లు చేసుకున్నాను. తెల్లారేసరికి మూడు మండలాల్లో పంచేయగానే.. నా ప్రత్యర్థి అవే ప్రాంతాల్లో తను ఓటుకు రూ.2 వేలు పంచడం మొదలుపెట్టారు. తప్పని పరిస్థితిలో నేను ఓటుకు అదనంగా మరో రూ.2 వేలు ఇవ్వాల్సి వచ్చింది’ అని ఓ దక్షిణ తెలంగాణ జిల్లాకు చెందిన ఓ ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి తన అనుభవాన్ని పంచు కున్నారు. ఆ నియోజకవర్గంలో పోలింగ్‌ ముగిసే టప్పటికీ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.100 కోట్లు ఖర్చు చేశారు. ‘నా రెండు దశాబ్దాల రాజకీయ అనుభవంలో చెపుతున్నా, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న లోక్‌సభ నియోజకవర్గంలోనూ ఇందులో నాలుగో వంతు కూడా ఖర్చు కాదు. కానీ, ప్రత్యర్థి నా ఓటమి లక్ష్యంగా పన్నుతున్న పన్నాగాలు చూసి ఒక దశలో రాజకీయాలపైనే అసహ్యం కలి గింది. కానీ ఏం చేస్తాం..బరిలో దిగాను కాబట్టి నేనూ అదేస్థాయిలో పంచక తప్పలేదు’ అని ఆ అభ్యర్థి వాపోయారు.

ఖమ్మం ఫస్ట్‌ 

తెలంగాణలోని పాత పది జిల్లాల్లో భారీగా డబ్బు పంపిణీ చేసిన వాటిలో ఖమ్మం జిల్లాలోని 4 నియోజకవర్గాలు మొదటి స్థానంలో.. పాలమూ రు జిల్లాలోని 4 నియోజక వర్గాలు రెండో స్థానం లో నిలుస్తాయి. ఈ 2 జిల్లాలకు పోటీగా నల్లగొం డ, వరంగల్‌ జిల్లాలోని చాలా నియోజక వర్గాల్లో డబ్బు పంపిణీ జరిగింది. ఖమ్మం జిల్లాలోని 2 నియోజక వర్గాల్లో పోలింగ్‌కు ఒకరోజు ముందు రూ.30 కోట్ల చొప్పున ఖర్చు చేయగా, మిగిలిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఖర్చు రూ.25 కోట్లు దాటింది. నల్లగొండ జిల్లాలోని ఓ నియోజక వర్గంలో ఒక అభ్యర్థి రూ.40 కోట్లు, ప్రత్యర్థి రూ. 30 కోట్లు ఖర్చు చేశారు. అదే జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో అభ్యర్థి ఖర్చు సగటు రూ.20 కోట్లు దాటిం ది. పాలమూరు జిల్లాలోని 3 నియోజక వర్గాల్లో అభ్యర్థి రూ.35 కోట్లు ఖర్చు చేసినట్లు,  చివరి రెండ్రోజుల్లోనే ఈ 3స్థానాల్లో ఖర్చు రూ. 120 కోట్లు దాటిందని ఆ జిల్లాలో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి చెప్పారు. వరంగల్‌ జిల్లాలోని ఓ నియోజక వర్గంలో అభ్యర్థులు సగటున రూ.30 కోట్లు ఖర్చు చేస్తే ఈ జిల్లాలోని మరో 4 నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఖర్చు సగటున రూ.25 కోట్లుగా ఉండొచ్చని భావిస్తున్నారు.

admin