టెన్షన్‌.. టెన్షన్‌.. కూటమిలో తీసి‘వెత’లు….!!!

హైదరాబాద్‌: గెలిచేదెవరు… ఓడేదెవరు. అధికారం ఎవరికి, ప్రతిపక్షంలో ఎవరుంటారు?  వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్ధుల్లోనే కాదు. సాధారణ ప్రజానీకంలోనూ  ఇదే చర్చ. ఒకవైపు ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల అంచనాలు ఉత్కంఠ  రేపుతున్న తరుణంలో మరో రెండు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై నగరంలో ఏ ఇద్దరు కలిసినా  ఎన్నికలే చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు అభ్యర్థులు సైతం తమ తప్పొప్పులను, బలాబలాలను సమీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్‌ బూత్‌లో నమోదైన ఓట్లను అంచనా వేస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందనే అంశంపైన బూత్‌స్థాయి కార్యకర్తలతో జరుపుతున్న సంప్రదింపులు తారాస్థాయికి చేరాయి. ఫలితాలు వెలువడేందుకు మరో రెండు రోజుల గడువు ఉన్న దృష్ట్యా ఈ రెండు రోజుల పాటు ఒక్కో అభ్యర్ధి తన నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లలో కాలనీలు, బస్తీల వారీగా  తమకు పట్టున్న ప్రాంతాలను, నమోదయ్యేందుకు అవకాశం ఉన్న ఓట్లను అంచనా వేస్తున్నారు.

మరోవైపు  చాలా చోట్ల పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు కావడం, ఓటర్ల  జాబితాలో పేర్లు లేకపోవడంతో కొంతమంది అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తమకు బాగా ఆదరణ, పట్టున్న ప్రాంతాల్లోనే ఓట్లు గల్లంతైపోవడంతో గెలుపుపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు. నగరంలో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చేసిన  ప్రయత్నాలు, ప్రచార కార్యక్రమాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. యథావిధిగా పోలింగ్‌ శాతం చాలా తక్కువగానే నమోదైంది. ఈ నేపథ్యంలో  అతి తక్కువ పోలింగ్‌  ఏ పార్టీలకు పట్టం కట్టగలదనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 24 నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థులు తమ గెలుపుపైన స్పష్టమైన ధీమా వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు అంతర్మథనంలో పడిపోయారు.

కూటమిలో తీసి‘వెత’లు…
ఉప్పల్‌ స్వరూప్‌నగర్‌కు చెందిన ఒక పోలింగ్‌ బూత్‌ వద్ద  ఓ మహిళ  తనకు  నచ్చిన హస్తం గుర్తు కనిపించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి అక్కడ ప్రజాకూటమి  నుంచి  తెలుగుదేశం అభ్యర్థి బరిలో ఉన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలనుకున్నవాళ్లు  సైకిల్‌పై  వేయాలి. కానీ  ఆ మహిళ చేతి గుర్తుకు తప్ప మరో గుర్తుకు ఓటు వేసేందుకు నిరాకరించి వెళ్లిపోయారు. ఒక్క ఉప్పల్‌లోనే కాదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రజాకూటమి అభ్యర్థుల గెలుపోటములపైన ఈ  ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలనుకున్న వాళ్లకు చేయి గుర్తు మాత్రమే కనిపించడం, కొన్ని చోట్ల టీజేఎస్‌ గుర్తు కనిపించడంతో ఓటర్లలో విముఖత  వ్యక్తమైంది. ఇక ప్రచారంలోనూ ఇదే  పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసేందుకు వెనుకడుగు వేశారు. (చంద్రబాబు జోక్యం ప్రతికూలమే…)

అలాగే తెలుగుదేశం వాళ్లు కూడా కాంగ్రెస్‌కు మనస్ఫూర్తిగా ప్రచారం చేయలేకపోయారు. పై స్థాయిలో కూటమి పటిష్టంగానే ఉన్నప్పటికీ పోలింగ్‌ బూత్‌ల స్థాయిలో ఈ లోపం  ప్రస్ఫుటమైంది. టీజేఎస్‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఏ ఓటు ఏ అభ్యర్ధికి పడిందనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితులన్నింటిపైనా అభ్యర్థులు  పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోనే ఇదే తరహా అంతర్మథనం కొనసాగుతోంది. ప్రత్యర్ధులతో తాము పోటీపడగలిగామా లేదా అనే అంశంతో పాటు, ఆశించిన ఓట్లు తమ ఖాతాలోనే పడతాయా లేక, ప్రత్యర్థుల ఖాతాలో చేరతాయా అనే దిశగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఈ ఉత్కంఠ ఇలాగే ఉండనుంది. 

ఓటు జారి గల్లంతయిందే….
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతైపోవడం రాజకీయ పార్టీలకు ఆశనిపాతంగా మారింది. మల్కాజిగిరి  నియోజకవర్గంలోనే సుమారు  40 వేల ఓట్లు గల్లంతైనట్లు స్థానికులు పెద్ద ఎత్తున  ఆందోళన  వ్యక్తం చేశారు. ఉప్పల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఎల్‌బీనగర్, పాతబస్తీలోని చార్మినార్, యాఖుత్‌పురా, తదితర నియోజకవర్గాల్లో  పోలింగ్‌ బూత్‌ల వరకు తరలివచ్చిన ఓటర్లు  జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.

మరోవైపు లక్షలాది మంది నగరవాసులు తమ సొంత ఊళ్లలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వెళ్లారు. దీంతో అనేక చోట్ల అభ్యర్ధుల అంచనాలు తలకిందులయ్యాయి. కలిసొస్తాయనుకునున్న కాలనీలు, బస్తీల్లో  ఓట్లు గల్లంతైపోవడం, కాదనుకున్న చోట్ల  పెద్ద ఎత్తున ఓట్లు నమోదుకావడంతో  వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులను ఆందోళనకు గురి చేసింది. దీంతో తాజాగా ఏ పోలింగ్‌ బూత్‌లో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి. వాటిలో తమకు దక్కేవెన్ని అనే కోణంలో విస్తృతంగా  పరిశీలిస్తున్నారు. మరోవైపు తమ ప్రచార తీరుతెన్నులను సైతం సమీక్షించుకుంటున్నారు. ప్రత్యర్థులతో ధీటుగా తమ ప్రచారం కొనసాగిందీ లేనిదీ కార్యకర్తలతో కలిసి చర్చిస్తున్నారు.లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దిశగా అన్ని పార్టీల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

admin