టీఆర్‌ఎస్‌ సుమారు 90 స్థానాలు గెలిచే దిశగా దూసుకెళ్తోంది.టీఆర్‌ఎస్‌ ప్రభంజనం.!!

JMRTVLIVE హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రయోగం ఫలించింది. కేసీఆర్ వ్యూహం ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్ నిలువలేకపోయింది. కారు స్పీడును అందుకోలేక ఫ్రంట్ కుదేలైంది. తాజా సమాచారం మేరకు టీఆర్‌ఎస్‌ సుమారు 90 స్థానాలు గెలిచే దిశగా దూసుకెళ్తోంది.

అభివృద్ధి, రైతు ఎజెండా, జనాకర్షక పథకాలే నినాదంగా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌ అఖండ విజయాన్ని చేజిక్కించుకుంది. గులాబీజెండాను మరోసారి రెపరెపలాడించింది. హంగ్‌, ప్రజాకూటమిదే విజయం అన్న మాటలను పటాపంచల్‌ చేస్తూ తెలంగాణ ప్రజానీకం గులాబీ అధినేత కేసీఆర్‌కే మరోసారి పట్టం కట్టారు. ఆయనతో తమకు భావోద్వేగ సంబంధాలున్నాయని తమ ఓటు తీర్పుతో చాటి చెప్పారు. కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి పెచ్చుమీరి పోయిందన్న ఆరోపణలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదనే విషయం ఫలితాలతో స్పష్టమైంది. కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు.. పెన్షన్లు, రైతు బంధు, షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మీలకు ముగ్ధులైన ఓటర్లు.. ఆయన గెలుపుకోసమే పల్లెబాట పట్టి మరీ ఓట్లేసినట్లు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన పోలింగ్‌ శాతంతో సుస్పష్టమైంది.

ఫలించిన ముందస్తు వ్యూహం..
రాజకీయాల్లో కాకతాళీయంగా ఏదీ జరగదు, అన్నీ పథకం ప్రకారం అమలు చేస్తేనే జరుగుతాయని అంటారు. ఈ సంగతి బాగా తెలిసిన కేసీఆర్, ఎన్నికల యుద్ధం తనకు అనువుగా ఉన్నప్పుడే చేయాలని నిర్ణయించారు. ముందస్తు ఎన్నికల బరిలోకి ప్రత్యర్థులను లాగారు. ఎన్నికలకు 9 నెలల సమయం ఉన్నా.. జనాకర్షక పథకాలపై నమ్మకంతో బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌ అనుకున్న విజయం సాధించింది. ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి దూసుకెళ్లింది. ఎప్పటికప్పుడు ప్రజాకూటమి ఎత్తుగడులను ఎదుర్కోవడం.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడునే తన అస్త్రంగా మల్చుకుని సెంటిమెంట్‌ రాజేయడంలో కేసీఆర్‌ సఫలమయ్యారు. పార్టీ క్యాడర్‌లో విజయంపై అనిశ్చితి నెలకొన్నప్పటికి.. అంతా తానై.. అన్నిచోట్ల తానే అభ్యర్థినన్నట్లు పట్టిష్ట వ్యూహంతో కేసీఆర్‌ ప్రణాళిక రచించారు.

సెప్టెంబర్‌2న కొంగర్‌కలాన్‌ ప్రగతినివేధన సభతో ముందస్తు ఎన్నికలకు హింట్‌ ఇచ్చిన కేసీఆర్‌.. అప్పటి నుంచి ఎన్నికల ముగిసేంతవరకు దూకుడుగా వ్యవహరించారు. ప్రత్యర్థులు తన వ్యూహాలను పసిగట్టి మేల్కొనేలోపే మరో ఎత్తుగడతో వారిని ఉక్కిరిబిక్కిరి చేశారు. సెప్టెంబర్‌6న అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్‌.. అదే రోజు 105 మంది అభ్యర్థులను ప్రకటించి రికార్డు సృష్టించారు. అప్పటి నుంచి దాదాపు మూడు నెలల పాటు అభ్యర్థులను నియోజకవర్గాల్లోని ప్రజల మధ్య ఉండేలా ఆదేశాలిచ్చారు.

హుస్నాబాద్‌ టూ గజ్వేల్‌..
వాస్తవానికి కేసీఆర్‌ ప్రకటించిన 105 మంది అభ్యర్థులపై ఆయా నియోజకవర్గాల్లో ఆ సమయంలో చాలా వ్యతిరేకత ఉంది. కేసీఆర్‌ ఎక్కువగా సిట్టింగ్‌లకు ఇవ్వడం కూడా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నచ్చలేదు. టికెట్‌ దక్కని నేతలు అలకబూనడం.. అసమ్మతి జెండా ఎగురువేయడం వంటివి చేశారు. కానీ వీటిని ముందే పసిగట్టిన కేసీఆర్‌ అందరితో చర్చించి అసమ్మతి లేకుండా జాగ్రత్తపడ్డారు. ఇక నియోజకవర్గ ప్రజల్లో చాలా మంది సీఎం కేసీఆర్‌ కావాలి.. కానీ ఎమ్మెల్యేగా తమ అభ్యర్థి వద్దని బహిరంగంగానే చెప్పారు. కానీ వారి అభిప్రాయాన్ని కేసీఆర్‌ సుడిగాలి పర్యటనతో మార్చేశారు. చివరకు కేసీఆర్ కోసమైనా టీఆర్‌ఎస్‌కు ఓటేద్దామని ప్రజలు సిద్దమయ్యేలా చేశారు.

సెప్టెంబర్‌ 8న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ సభలో ‘ఆశీర్వదించండి మళ్లీ వస్తున్నా’ అనే నినాదంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన గులాబీ బాస్‌.. 116 సెగ్మెంట్లను కవర్‌చేస్తూ 87 సభల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతిరోజు సగటున నాలుగు నుంచి తొమ్మిది సభల్లో పాల్గొంటూ తెలంగాణ ఆత్మగౌరవం అనే సెంటిమెంట్‌ రాజేశారు. ముఖ్యంగా 24గంటల విద్యుత్‌.. రైతు ఎజెండా పథకాలను వివరిస్తూ.. మేనిఫెస్టో ప్రజలకు చేరువయ్యేలా చేశారు. వైరా, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లలో మినహా 116 అసెంబ్లీ సెగ్మెంట్లనూ ఆయన కవర్‌ చేశారు.ఈ సభల్లో కాంగ్రెస్‌ గెలిస్తే జరిగే పరిణామాలు.. ఢిల్లీ, అమరావతి కేంద్రంగా పాలన సాగుతుందని హెచ్చరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒకటి రెండుసార్లు ఆలోచించాలని పదేపదే చెబుతూ.. వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు కేటీఆర్‌, హరీష్‌ రావుల ప్రచారం కూడా టీఆర్‌ఎస్‌ విజయానికి కలిసొచ్చింది.

admin