తెలంగాణ ఫలితాలపై వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే?

JMRTVLIVE శ్రీకాకుళం : భస్మాసురుడు చేయి పెట్టినా..చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదేనని, తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఈ విషయం దేశం మొత్తం అర్థమైందని ఏపీ ప్రతిపక్షనేత,వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 319వ రోజు మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగన్నరేళ్ల చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తిన వైఎస్‌ జగన్‌. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.

చంద్రబాబా? ఎల్లో మీడియా..
‘తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు యుద్దం చేస్తున్నారా? లేక ఆయన ఎల్లో మీడియా యుద్దం చేస్తుందా? అనిపించింది. గత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 24, టీడీపీకి 15 శాతం ఓట్లు రాగా.. అధికారం దక్కించుకున్న టీఆర్‌ఎస్‌కు 34 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ, కాంగ్రెస్‌లు కలిస్తే 39 శాతం ఓట్లు వస్తాయని చంద్రబాబు అనుకున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్‌లు కలిసి 5 శాతం ముందంజలో ఉండి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు.

టీఆర్‌ఎస్‌తో తొలి ప్రయత్నం..
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోక ముందు టీఆర్‌ఎస్‌తో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఆయన బామ్మర్ధి హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా కేటీఆర్‌తో బేరసారాలు ఆడారు. పొత్తుకు టీఆర్‌ఎస్‌ అంగీకరించకపోవడంతో.. ప్రధాని నరేంద్రమోదే అడ్డుకున్నారని అసెంబ్లీ సాక్షిగా ఆరోపించారు. గతంలో చంద్రబాబుది దుష్టపాలన అన్న కాంగ్రెస్‌.. 5 నెలల క్రితం ఆయన నాలుగేళ్ల అవినీతి పాలన గురించి చార్జ్‌షీట్‌ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. తీరా తెలంగాణ ఎన్నికల్లో అదే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, చంద్రబాబులు ఇద్దరూ.. కలిసి వేదికను పంచుకున్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే జనాలు ఎలా నమ్ముతారు. కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు.
అలా మాట్లాడాటానికి సిగ్గుండాలి..
అవినీతి డబ్బుతో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. తెలంగాణ వెళ్లి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇలా మాట్లాడాటానికి సిగ్గులేదా చంద్రబాబు? అని అడుగుతున్నా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన అవినీతి సొమ్ముతో ఆడియో, టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. ఆయన అన్న బ్రీఫ్‌డ్‌మీ మాటలు అందరికి గుర్తున్నాయి. అందుకే తెలంగాణలో చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. చంద్రబాబు వంటి నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.

లగడపాటి రాజకీయ విశ్లేషకుడా..
చంద్రబాబు ఎలా చెబితే అలా చేయడానికి ఎల్లో మీడియా ఉందని, సరిగ్గా పోలింగ్‌కు 36 గంటల ముందు లగడపాటి రాజగోపాల్‌ను తీసుకొచ్చారు. లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది. లగడపాటి మహాకూటమి క్లీన్‌స్వీప్‌ చేస్తుందని చెబుతారు. ఆయన చెప్పిన మాటలను ఎల్లో మీడియా.. ఊదరగొడుతుంది. పోలింగ్‌ జరుగుతన్న రోజే.. మధ్యాహ్నం ఓ ఫేక్‌ ఎగ్జిట్‌పోల్‌ తీసుకుచ్చారు. మహాకూటమి ఘనవిజయం సాధించబోతుందని వాట్సాప్‌లో ప్రచారం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పట్టుబడ్డ క్యాష్‌ ఎంతో తెలుసా? అక్షరాల రూ.142 కోట్ల 62 లక్షలు. తెలుగుదేశం నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ డబ్బంతా మన జేబులో నుంచి దోచేసిందే. ఇంతకన్నా ఘోరమైన రాక్షసపాలన ఎక్కడైనా జరుగుతుందా ? రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. 11 జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా కరువుతో అల్లాడుతా ఉన్నాయి. ఇంతటీ మోసం చేసిన వ్యక్తికి ఎలా ఓట్లేస్తారు? అందుకే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

admin