జనవరి 9న వైసిపి తొలి జాబితా!!!!

-100-150 పేర్లు ఒకేసారి
-10-15 ఎంపి అభ్యర్థుల పేర్లు కూడా
-ఇచ్ఛాపురంలో ప్రకటన
-పాదయాత్ర ముగింపు రోజున ముహూర్తం

JMRTVLIVE ప్రత్యేక ప్రతినిధి- అమరావతి:-
కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించేందుకు వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడే అభ్యర్ధుల తొలి జాబితాను ఆయన వెల్లడించనున్నారని సమాచారం.

తొలి జాబితాలో 100 నుంచి 150 మంది పేర్లను ప్రకటించనున్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ మల్లేనే తాను కూడా ఒకేసారి పెద్ద సంఖ్యలో అభ్యర్ధులను వెల్లడించాలని జగన్‌ యోచిస్తున్నారు. ఎపిలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతున్న దృష్ట్యా ఇచ్ఛాపురంలో విడుదల చేసే తొలి జాబితాలో 10 నుంచి 15 మంది ఎంపి అభ్యర్ధులను సైతం ప్రకటించనున్నారని వైసిపి వర్గాలు వెల్లడించాయి. పాదయాత్ర ముగింపు రోజున ఇచ్ఛాపురానికి పార్టీ సీనియర్లతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల కన్వీనర్లనందరినీ రావాలని ఇప్పటికే జగన్‌ ఆదేశించారని సమాచారం.

టిడిపి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తాము ఆర్నెల్ల ముందే అభ్యర్ధులను ప్రకటిస్తామని గతంలో చెప్పారు. జనవరిలో టిక్కెట్లిస్తామని ఇటీవల జరిగిన టిడిపి సమన్వయ కమిటీ భేటీల్లో సంకేతాలిచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు, ఆ పార్టీకి సీట్ల కేటాయింపులపై అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ అప్రమత్తమయ్యారని తెలిసింది.

టిడిపి కంటే ముందుగానే అదీ పాదయాత్ర ముగింపు సందర్భాన్ని పురస్కరించుకొని వైసిపి అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేయాలని యోచిస్తున్నారు. మొదటి జాబితాలో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోగజకవర్గాలన్నింటా వైసిపి అభ్యర్ధులను ఖరారు చేస్తారని చెబుతున్నారు. అలాగే వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లోనూ అభ్యర్ధులను తొలి జాబితాలోనే వెల్లడిస్తారని సమాచారం.

admin