తిరుపతి చేరుకున్న వైఎస్‌ జగన్‌….

తిరుపతి కి చేరుకున్న వైఎస్‌ జగన్‌:

JMRTV తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరుపతి చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహానికి వచ్చిన ఆయనకు వైఎ‍స్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రజాసంకల్పయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి దర్శనం కోసం వచ్చిన జననేతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో గెస్ట్‌హౌస్‌ ప్రాంగణం కిక్కిరిసింది.

వైఎస్‌ జగన్‌ ఈ మధ్యాహ్నం అలిపిరి వెళ్లి అక్కడి నుంచి కాలినడకన సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. ఈ రోజు రాత్రి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు చేరుకుంటారు.

రేణిగుంటలో…
వైఎస్‌ జగన్‌ ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో రేణిగుంట చేరుకున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇక్కడికి వచ్చిన జననేతకు వైఎ‍స్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు తరలివచ్చిన జనంతో రేణిగుంట రైల్వే స్టేషన్‌ కిక్కిరిసింది. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. జై జగన్‌ నినాదాలతో రైల్వే స్టేషన్‌ ప్రాంగణం మార్మోగింది. సీఎం జగన్‌ అంటూ రైల్వేస్టేషన్‌లో ఉన్న వారితో పాటు, రైలులో ఉన్న ప్రయాణికులు నినదించడం విశేషం.

admin