తిరుమల చేరుకున్న జననేత వైఎస్‌ జగన్‌..

JMRTVLIVE తిరుమల తిరుపతి: అడుగడుగునా భక్తులకు అభివాదం చేస్తూ.. ఒక సామాన్య భక్తుడిలా అలిపరి మార్గంలో కాలినడకన ముందుకుసాగిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలుగకుండా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లి వైఎస్‌ జగన్‌ శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు.

సుదీర్ఘమైన ప్రజా సంకల్ప యాత్రను పూర్తిచేసి చరిత్ర సృష్టించిన ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం తిరుపతికి చేరుకున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం పద్మావతి గెస్ట్‌హౌస్‌ నుంచి అలిపిరి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. అక్కడి నుంచి కాలినడక మార్గంలో తిరుమలకు బయలుదేరారు. పెద్దసంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన వెంట కదిలారు. ఈ సందర్భంగా మెట్లమార్గం గోవింద నామస్మరణతో మార్మోగింది. అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లకు మెక్కి నడక ప్రారంభించిన జననేత.. అడుగడుగునా భక్తులకు అభివాదం చేస్తూ.. సామాన్య భక్తుడిలా ముందుకుసాగారు. మార్గమధ్యలో ఆంజనేయస్వామిని దర్శించుకుని.. కొబ్బరికాయ కొట్టారు. వడివడిగా మెట్లు ఎక్కిన వైఎస్‌ జగన్‌ ఎక్కడా ఆగకుండా ముందుకు కదిలారు. అలుపులేకుండా పాదయాత్ర నిర్వహించిన జననేత.. తిరుమల మెట్లు ఎక్కడంలోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మెట్ల దారిలో సాటి భక్తులను పలుకరిస్తూ.. వారికి ఆత్మీయంగా అభివాదం చేస్తూ ముందుకు కదిలిన జననేత.. మర్గమధ్యలో నరసింహా ఆలయం మీదుగా మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు వైఎస్‌ జగన్‌ తీసుకోనున్నారు. రాత్రికి తిరుమలలో బస చేయనున్న ఆయన.. శుక్రవారం ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు.

వైఎస్‌ జగన్‌ రాకపై భక్తులు, తిరుపతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు వైఎస్‌ జగన్‌కు, ఆయన కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయని అంటున్నారు. చిన్న వయస్సులోనే ఎన్నో బాధలు ఎదుర్కొని తండ్రి చూపిన బాటలో ప్రజాశ్రేయస్సు కోసం వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారని అన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజలను కుటుంబంగా భావించి వారి కష్టాను తీర్చాడానికి ముందుకు సాగుతూనే ఉన్నారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని అన్నారు. వైఎస్‌ జగన్‌తో కలిసి పది అడుగులు వేసిన తమ అదృష్టంగా భావిస్తామన్నారు.

రేణిగుంటలో…

వైఎస్‌ జగన్‌ ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో రేణిగుంట చేరుకున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇక్కడికి వచ్చిన జననేతకు వైఎ‍స్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు తరలివచ్చిన జనంతో రేణిగుంట రైల్వే స్టేషన్‌ కిక్కిరిసింది. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. జై జగన్‌ నినాదాలతో రైల్వే స్టేషన్‌ ప్రాంగణం మార్మోగింది. సీఎం జగన్‌ అంటూ రైల్వేస్టేషన్‌లో ఉన్న వారితో పాటు, రైలులో ఉన్న ప్రయాణికులు నినదించడం విశేషం.