సామాన్యుడిలా జగన్ శ్రీవారి దర్శనం, విశాఖలో హత్యాయత్నం నుంచి కాపాడింది ఆయనే, ఆశ్చర్యమేసింది: ఎమ్మెల్యే కంబాల జోగులు

JMRTVLIVE, By-Y.VASU NAIDU.
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

జగన్ సంప్రదాయ దుస్తులు, పట్టు వస్త్రాలను ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా, సామాన్య భక్తుడిలా స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లారు. జగన్ వెంట వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, కంబాల జోగులు, తదితరులు ఉన్నారు.

భక్తులకు అభివాదం చేస్తూ:-శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి జగన్‌ అలిపిరి నుంచి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. అడుగడుగునా భక్తులకు అభివాదం చేస్తూ సామాన్య భక్తుడిలా ముందుకు సాగారు. మార్గమధ్యలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు.

అదే జగన్ నమ్మకం:- ఎమ్మెల్యే కంబాల జోగులు
జగన్ సామాన్యుడిలా దర్శనం చేసుకోవడంపై వైసీపీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు స్పందించారు. ప్రజా కుటుంబంలో తాను కూడా ఒకడిని అన్న భరోసాను తమ పార్టీ అధినేత ఇస్తున్నారని చెప్పారు. తిరుమలలో జగన్‌కు స్వాగతం పలికేందుకు ఇతర నేతలతో పాటు ఎమ్మెల్యే కంబాల జోగులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీఐపీ దర్శనం కాకుండా సామాన్యుడిలా సాధారణ దర్శనానికి జగన్ వెళ్లారన్నారు. ఏ దర్శనంలో వెళ్లినా దేవుడు ఆశీర్వదిస్తాడన్న నమ్మకం ఆయనకు ఉందని చెప్పారు.

అందరి దేవుళ్లను నమ్ముతారు: ఎమ్మెల్యే కంబాల జోగులు:
అందరి దేవుళ్లను నమ్మే వ్యక్తి జగన్ అని కంబాల జోగులు చెప్పారు. ఈరోజు సాధారణ భక్తులతో కలిసి దర్శనానికి వెళ్లడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. ఇలాంటి నాయకుడి వద్ద పని చేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నామని చెప్పారు.జగన్ మోహన్ రెడ్డి గారితో పాటు జీవితాంతం ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో చేపట్టారని చెప్పారు.

జగన్ సీఎం కావడాన్ని ఆపలేరు:కంబాల జోగులు
ఈ పాదయాత్రలో ఆయనను భూమిపై లేకుండా చేసేందుకు విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిందని కంబాల జోగులు అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని జగన్ పాదయాత్రకు బయలుదేరారని, కాబట్టి ఆయనను స్వామివారే కాపాడారని చెప్పారు. పాదయాత్రకు ముందు స్వామివారిని దర్శించుకున్న జగన్, నేడు పాదయాత్ర ముగిశాక మళ్లీ మొక్కు తీర్చుకున్నారన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరన్నారు. జగన్‌ ఎప్పుడు సామాన్యునిలానే ఉంటారన్నారు. చంద్రబాబులా ప్రజలను చూసి విసుగు చెందరన్నారు. జగన్‌ సామాన్యునిలా వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

admin