ఎల్లో మీడియాతో జాగ్రత్త….. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.!!!

JMRTVLIVE తిరుపతి : నాలుగున్నరేళ్లుగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్న టీడీపీ సర్కార్‌.. ఎన్నికలు సమీస్తున్న వేళ కొత్త డ్రామాకు తెర తీసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో బుధవారం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సీపీ సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ… రానున్న రెండు నెలలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు ప్రలోభాలకు లోను కాకుండా చూడాలని, ప్రతి ఓటర్‌ ఓటు వేసేలా బూత్‌ కమిటీలు బాధ్యత తీసుకోవాలని వైఎస్‌ జగన్‌ కోరారు. చంద్రబాబు ఒక్కరే మనకు పోటీ కాదని ఎల్లో మీడియాతో కూడా పోరాటం చేయాలని అన్నారు. ఉన్నది లేనట్లుగా… లేనిది ఉన్నట్లుగా ఎల్లో మీడియా చూపిస్తోందన్నారు. (ఎన్నికల సమర శంఖం పూరించిన వైఎస్‌ జగన్‌)

చంద్రబాబు ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు.. మూడు నెలల కోసం’ మరో సినిమా చూపిస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. గత ఎన్నికల్లో గెలిచాక మొదలైన బాబు కొత్త సినిమా కథ ‘రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనేది’ ప్రతి కాంట్రాక్ట్‌లోనూ కమీషన్లే. ఇసుక, మట్టి, భూములు సహా దేన్నీ వదిలి పెట్టలేదు. ఈ అయిదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారు. పై స్థాయిలో చంద్రబాబు, కిందస్థాయిలో జన్మభూమి కమిటీలు దోచుకున్నాయి. నాలుగేళ్లు పాటు బీజేపీ, పవన్‌ కల్యాణ్తో కలిసి రాష్ట్రాన్ని ముంచేశారు. ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని డ్రామాలాడుతున్నారు. తాజాగా ప్రధాని మోదీతో పోరాటం చేస్తున్నట్లు నాటకాలాడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ కట్టకుండానే జాతికి అంకితం చేయడం చంద్రబాబు సినిమాలో చూశాం. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే. హోదా కోసం పోరాటం చేస్తున్నవారిపై కేసులు పెట్టడమే కాకుండా, జైలుకు పంపుతామని బెదిరించారు. ఇప్పుడు హోదా కోసం పోరాటం అంటూ చంద్రబాబు నల్ల చొక్కాలు వేసుకుంటున్నారు. హోదా కోసం పోరాటం అంటూ ఘరానా మోసం​ చేస్తున్నారు.

డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం అయిదేళ్లగా ఏం మాట్లాడలేదు. 14వేల కోట్లు రుణం ఉంటే… అయిదేళ్లలో 25వేల కోట్లకు ఎగబాకాయి. పసుపు-కుంకుమ పేరుతో మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు రైతులకు కేటాయించారట. రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. కట్టని రాజధానిలో వేల ఎకరాల భూములను అమ్ముకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్నారు. నాలుగున్నరేళ్లపాటు నిరుద్యోగులకు జాబులు ఇవ్వరు. 57 నెలలు మోసం చేసి… ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటున్నారు. మన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ప్రకటించా. చంద్రబాబు ఇప్పుడు ఖాకీ డ్రస్‌ వేసుకుని కాపీ కొట్టారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 75వేలు ఇస్తామని మనం చెప్పాం. ఐదేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ప్రతి కులానికి కార్పొరేషన్‌ అంటున్నారు. 2014కు ముందు చేసిన బీసీ డిక్లరేషన్‌ చంద్రబాబుకు గుర్తుకు రాదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్లీ బీసీలకు హామీలిస్తున్నారు. అంగన్‌వాడీలకు జీతాలు పెంచేందుకు బాబుకు మనసు రాదు. పాదయాత్రలో అంగన్‌ వాడీలకు జీతాలు పెంచుతామని చెప్పాను. తాజాగా చంద్రబాబు నిన్ననే ఒక సినిమా తీశారు. చంద్రబాబు తనది కాని బడ్జెట్‌… ఆరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా చంద్రబాబు బడ్జెట్‌ పెట్టారు. కాపీ కొట్టడం కూడా ఆయనకు సరిగా రావడం లేద’ని అన్నారు.

admin