అప్‌డేట్స్‌: కశ్మీర్‌లోకి పాక్‌ విమానాలు.. యుద్ధ వాతావరణం.

న్యూఢిల్లీ: పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్‌ వైమానిక దాడులు నిర్వహించడంతో ఒక్కసారిగా సరిహద్దులు వేడెక్కాయి. భారత్‌ వైమానిక దాడులతో ఉగ్రవాదులను చావుదెబ్బ తీయడంతో అసూయతో రగిలిపోతున్న పాకిస్థాన్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా బరితెగించి.. ఏకంగా భారత గగనతలంలోకి యుద్ధవిమానాలను దాయాది తరలించింది. పూర్తి అప్రమత్తంగా భారత వైమానిక దళం.. పాక్‌ యుద్ధ విమానాలను వెంటనే వెంబడించి తరిమికొట్టాయి. ఈ క్రమంలో భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవి..

రెండు కూల్చాం.. ఇద్దరి అరెస్టు.. పాక్ కట్టుకథలు!

భారత వైమానిక దాడుల నేపథ్యంలో కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్థాన్‌ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. తమ వైమానిక దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ భూభాగంలోకి వచ్చిన రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశామని, ఇద్దరు ఐఏఎఫ్‌ పైలట్లను అరెస్టు చేశామని పాక్‌ ఆర్మీ ప్రకటించింది. అరెస్టైన ఇద్దరిలో ఒకరు గాయపడితే.. ఆస్పత్రికి కూడా తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. అంతేకాదు తమ అధీనంలో ఉన్న భారత పైలట్‌ అంటూ ఒక వీడియో విడుదల చేసింది. ‘నేను వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను. ఐఏఎఫ్‌ అధికారిని. నా సర్వీసు నెంబర్‌ 27981’ అని పైలట్‌ చెప్తున్న అంశాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే, పాక్‌ వాదన కట్టుకథ మాత్రమేనని భారత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు పాక్‌ దినపత్రిక ‘డాన్‌’ వెబ్‌సైట్‌లో భారత విమానాన్ని కూల్చినట్టు ఓ ఫొటోను పెట్టి కథనాన్ని వండివార్చారు. అయితే, నాలుగేళ్ల కిందట కూలిపోయిన ఐఏఎఫ్‌ శిక్షణ విమానం ఫొటోను వాడుకొని.. ఈ విమానాన్నే పాక్‌ కూల్చేసిందని ఈ కథనంలో ఉటంకించారు. దీంతో ఆ పత్రిక కథనం ఫేక్‌ అని అర్థమవుతోంది.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ విమానాశ్రయంలోనూ తాత్కాలికంగా వైమానిక కార్యకలాపాలు రద్దు..
మన విమానాలను పాక్‌ కూల్చలేదు..

పాక్‌ కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత వైమానిక దళం హై అలర్ట్‌గా ఉంది. మరోవైపు భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు కూల్చివేసినట్టు పాకిస్తాన్‌ చెబుతున్న మాటల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పాక్‌ చేస్తున్న ప్రకటనలను ఖండించింది. దాడులు జరిగినట్టు పాక్‌ మీడియా చూపిస్తున్న దృశ్యాలు గతంలో జోధ్‌పూర్‌ ప్రమాదానికి సంబంధించినవని తెలిపింది. పాత దృశ్యాలు చూపించి పాక్‌ తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తుందని విమర్శించింది.
పాక్‌ బరితెగింపు.. పరిస్థితిని సమీక్షిస్తున్న మోదీ

ఢిల్లీ: ప్రధాని నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం.. కశ్మీర్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలు.. అనంతరం తలెత్తిన పరిణామాలను మోదీకి వివరిస్తున్న జాతీయ భద్రతా ఏజెన్సీ అధికారులు వివరిస్తున్నారు. ఈ సమావేశానికి హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వారితో కలిసి సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై మోదీ సమీక్షిస్తున్నారు.
సరిహద్దు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల మూసివేత..

భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. భద్రత కారణాల దృష్ట్యా చండీగఢ్‌‌, అమృతసర్‌, శ్రీనగర్‌, జమ్ము, లేహ్‌ విమానాశ్రయాలను మూసివేశారు.

మరోవైపు రాజస్తాన్‌ నుంచి బయలుదేరిన విమానాలతోపాటు, పాకిస్తాన్‌ మీదుగా ప్రయాణించే అంతర్జాతీయ విమానాలను అధికారులు దారి మళ్లించారు. పాక్‌ కూడా భారత్‌ వైపు ప్రయాణించే అన్ని పౌర విమానాలను రద్దు చేసింది. అలాగే సరిహద్దుల్లోని విమానాశ్రయాలను మూసివేసింది.
పాకిస్థాన్‌ విమానాలన్నీ బంద్‌!

సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం.. యుద్ధవిమానాల కూల్చివేత నేపథ్యంలో పాకిస్థాన్‌ తమ దేశానికి చెందిన విమానాశ్రయాల కార్యకలాపాలను నిలిపివేసింది. లాహోర్‌, ముల్తాన్‌, ఫైజలాబాద్‌, సియాకోట్‌, ఇస్లామాబాద్‌ విమానాశ్రయాల నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకల నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్‌ యుద్ధ విమానాలు రాజౌరి సెక్టార్‌లోని ఆర్మీ పోస్టులకు సమీపంలో బాంబులు జారవిడిచాయి. ఈ బాంబు శకలాలకు సంబంధించిన దృశ్యాలివి…

సరిహద్దుల్లోని నౌషెరా సెక్టార్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. ఎయిర్‌స్పెస్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లోకి ప్రవేశించిన ఈ యుద్ధ విమానాన్ని భారత వాయుసేన వెంటనే కూల్చివేసింది. నౌషెరా సెక్టార్‌లోని పాకిస్థాన్‌ భూభాగం పరిధిలోకి వచ్చే లామ్‌ వ్యాలీలో ఈ విమానం కూలిపోయింది. విమానం కూలిపోవడానికి ముందే పారాచ్యుట్‌ సాయంతో పాక్‌ పైలట్‌ కిందికి దూకిన దృశ్యాలు కనిపించాయి. దూకిన పాక్‌ పైలట్‌ ఏమయ్యాడన్నదికి ఇంకా తెలియరాలేదు.