వన్డే ప్రపంచకప్‌ భారత జట్టు ప్రకటన..!!!!

ముంబై: వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్‌ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సోమవారం ఖరారు చేసింది. చాహల్‌, పాండ్యాకు చోటు కల్పిస్తున్నట్టు ప్రకటిస్తుంది. అయితే, అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌లకు నిరాశే ఎదురైంది. కాగా, ఆల్‌ రౌండర్ల స్థానంలో హార్దిక్‌ పాండ్యాతో పాటు విజయ్‌ శంకర్‌కు చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నేతృత్వంలో ప్రపంచకప్‌లో పాల్గొనబోయే జట్టు ఈవిధంగా ఉంది.

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, కేఎల్‌ రాహుల్, విజయ్ శంకర్, ఎంఎస్‌ ధోని, కేదార్‌ జాదవ్, దినేశ్‌ కార్తీక్‌, చహల్, కుల్దీప్, భువనేశ్వర్‌, బుమ్రా, హర్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహమ్మద్‌ షమీ


గత ఆరు నెలలుగా నాలుగో నంబర్‌ ఆటగాడిపైనే చాలా చర్చ జరిగింది. నిజానికి గత ఏడాది అక్టోబరులో ఆసియా కప్‌ తర్వాత కోహ్లి బహిరంగంగానే రాయుడు సరైనవాడంటూ మద్దతు పలికాడు. గతేడాది ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన తర్వాత రాయుడు టీమిండియాలోకి పునరాగమనం చేశాక భారత్‌ 24 వన్డేలు ఆడితే రాయుడు 21 ఆడాడు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వన్డే సిరీస్‌ సమయంలో ఇంకా అనిశ్చితి ఉందంటూ కోహ్లి, రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందేహాలు రేకెత్తించాయి. కివీస్‌తో చివరి వన్డేలో చక్కటి బ్యాటింగ్‌తో 90 పరుగులు చేసిన రాయుడు ఆసీస్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. దాంతో రాయుడ్ని పక్కన పెట్టేశారు.

రాహుల్‌పై నమ్మకం..
ఊహించినట్లుగానే రాహుల్‌కు వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టులో చోట దక్కింది. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్‌ ఆటను పట్టించుకోమని మాటను సెలక్టర్లు పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు. రాహుల్‌ మిడిలార్డర్‌లో ఆడటంతో పాటు పైగా మూడో ఓపెనర్‌గా పని కొస్తాడనే ఉద్దేశంతో అతనికి చోటు కల్పించారు. మరోవైపు దినేశ్‌ కార్తీక్‌ను రెండో వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. ఈ రేసులో రిషభ్‌ పంత్‌ ఉన్నప్పటికీ, అనుభవాన్ని పరిగణలోకి తీసుకోనే అతనికి ఉద్వాసన పలికారు.

జడేజా, విజయ్‌ శంకర్‌లకు చాన్స్‌…

గత కొన్ని నెలలుగా ఆల్‌రౌండర్‌ స్థానానికి జడేజా, విజయ్‌ శంకర్‌ మధ్య పోటీ ఉంది. అయితే ఈ ఇద్దర్నీ ఎంపిక చేయడం ఊహించని పరిణామం. శంకర్‌ ఆట పట్ల సానుకూలంగా ఉన్న సెలక్టర్లు వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీకి ఎంపిక చేయడం అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. విజయ్‌ శంకర్‌ స్లో మీడియం పేస్‌ బౌలింగ్‌ కారణంగా అతని వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. మరోవైపు జడేజా మాత్రం కచ్చితత్వంతో కూడిన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేయగల సమర్థుడు. దాని వల్ల వారిపై ఒత్తిడి పెరిగి వికెట్లు దక్కడం చాలా సార్లు జరిగింది. పైగా జట్టులో అత్యుత్తమ ఫీల్డర్‌. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాతో చక్కగా రాణించడం జడేజాకు కలిసొచ్చింది.

admin