అంతా నా ఇష్టం! చంద్ర బాబు నాయుడు!

అమరావతి: ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి యథేచ్ఛగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ ఓట్లు కొనుగోలు పథకాలకు రాష్ట్ర ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులు మళ్లించిన చంద్రబాబు.. పోలింగ్‌ ముగిశాక అధికారం చేజారిపోతోందని తెలిసి మరీ బరితెగించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడిని ఒంటబట్టించుకుని అక్రమాలకు తెర తీస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి వచ్చే నెల 27వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. అప్పటి వరకు ముఖ్యమంత్రి, మంత్రులు అధికారిక సమీక్షలు నిర్వహించరాదు. కేవలం ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తేనో, శాంతి భద్రతలకు విఘాతం కలిగితేనో.. వాటిని చక్కదిద్దేందుకు మాత్రమే సీఎం వ్యక్తిగత పర్యవేక్షణ, సమీక్ష చేయవచ్చని నియమావళి స్పష్టం చేస్తోంది. అయితే గతంలో ఏ సీఎం వ్యవహరించని విధంగా చంద్రబాబు ఇప్పుడు నియమావళిని తుంగలో తొక్కుతూ బుధవారం పోలవరం ప్రాజెక్టుపై ప్రజావేదిక నుంచి సమీక్ష నిర్వహించారు. గురువారం ఏకంగా సచివాలయానికి వచ్చి సీఎం కుర్చీలో కూర్చుని సీఆర్‌డీఏ పనులపై సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్షలకు అధికారులు హాజరు కాకూడదు. అలాగే సీఎం కూడా అధికారులను ఆహ్వానించరాదు. అయితే చంద్రబాబు అధికారులను ఇరకాటంలో పెడుతూ తనకు కావాల్సిన వారికి ఖజానా నుంచి బిల్లులు చెల్లించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగానే సమీక్షల పేరుతో హడావుడి చేస్తున్నారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

కావాల్సిన వారికి దోచిపెట్టేందుకే..
ఇప్పటికే రాష్ట్ర ఖజానా నుంచి భారీగా నిధులను దోచేసిన చంద్రబాబు.. మరింతగా దండుకోవడానికే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ముసుగులో ఎన్నికల ముందు హడావుడిగా చేపట్టిన ప్రాజెక్టులకు పనులు కాకపోయినప్పటికీ బిల్లులు చెల్లించేలా ఎత్తుగడ వేశారని మరో అధికారి పేర్కొన్నారు. సాధారణ పరిపాలన వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తారని, అలాంటిది సీఎం ఏకంగా సచివాలయానికి వచ్చి సమీక్షలు నిర్వహించడం గతంలో ఎన్నడూ చూడలేదని మరో సీనియర్‌ అధికారి చెప్పారు. ఇప్పటికే పాసై డబ్బుల్లేక చెల్లింపులు నిలిచిపోయిన పనులకు సంబంధించి ఏకంగా 2,358.37 కోట్ల రూపాయలు చెల్లించేందుకు చంద్రబాబు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని సచివాలయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇటు రాజధాని, అటు సాగునీటి ప్రాజెక్టులు, నీరు–చెట్టు తదితర పనులకు చెందిన 9,104 బిల్లులకు ఆ మొత్తాన్ని చెల్లించి కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చాలని, తద్వారా తిరిగి కమీషన్ల రూపంలో దండుకోవాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఒక పక్క ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు పలు కార్పొరేషన్లకు చెందిన ఉద్యోగుల వేతనాలను కూడా నిలుపుదల చేసి కావాల్సిన వారి కాంట్రాక్టులకు చెల్లింపులు చేసేందుకే ఆర్థిక శాఖపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని స్పష్టమవుతోంది. బుధవారం ప్రజావేదికలో పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష చేస్తూ బిల్లుల చెల్లింపులకు లోపాయికారీగా ఆదేశాలు జారీ చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

సీఆర్‌డీఏలోనూ అదే ప్రణాళిక
గురువారం సీఆర్‌డీఏ పనులపై చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి నారాయణతో పాటు సీఎం కార్యాలయ అధికారి రాజమౌళి, ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఎండీ లక్ష్మీపార్థసారథి హాజరయ్యారు. ఇందులో రహదారులతో పాటు ఇతర ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించడమే కాకుండా వేసవి మండుతుండగా ఇప్పటి నుంచే మొక్కలు నాటాలంటూ సీఎం ఆదేశించారు. మొక్కలు నాటడం పేరుతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలను వ్యయం చేసిన సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.. ఇప్పుడు చంద్రబాబు ఆదేశాలతో మరిన్ని వందల కోట్ల రూపాయలు కాజేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు స్పష్టం అవుతోందని సీఆర్‌డీఏ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక పక్క రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి నివారణతో పాటు అత్యవసర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తుండగా.. మరో పక్క సీఎం విడిగా సమీక్షలు నిర్వహించడాన్ని ఉన్నతాధికార వర్గాలు తప్పుపడుతున్నాయి. ఇది ముమ్మాటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోలింగ్‌కు ఒక రోజు ముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న చర్యలను తప్పుపట్టిన చంద్రబాబు.. అనంతరం ఆయన కార్యాలయం ముందు ధర్నా చేయడం కూడా నియమావళిని ఉల్లంఘించడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పోలింగ్‌ ప్రక్రియను తప్పుదోవ పట్టించేలా ఈవీఎంలు పని చేయడం లేదని, తన ఓటు ఎవరికి వెళ్లిందో తెలియడం లేదనడం సరికాదంటున్నారు. అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలంటూ పోలింగ్‌ రోజు మీడియాతో మాట్లాడటం కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని అధికారులు పేర్కొంటున్నారు.

మీడియాకు ఎన్నికల కోడ్‌ విడుదల
ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సీఆర్‌డీఏతో పాటు శాంతి భద్రతలపై సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది మీడియాకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విడుదల చేశారు. దీనినిబట్టి.. ఈ సమయంలో సీఎం ఏ విధంగా సమీక్షలు నిర్వహిస్తారనేది ద్వివేది అంతరంగంగా తెలుస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఒక పక్క సీఎస్‌ 15వ ఆర్థిక సంఘం సభ్యునితో సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుండగా మరో పక్క చంద్రబాబు సీఆర్‌డీఏతో సమీక్ష నిర్వహించారు.

శాంతిభద్రతల సమీక్షకు హోం శాఖ విముఖత
శాంతిభద్రతలపై సమీక్షకు రావాల్సిందిగా డీజీపీతో పాటు హోం శాఖ అధికారులను సీఎం కార్యాలయం ఆహ్వానించింది. పోలింగ్‌ రోజు ఘర్షణల కేసుల విషయం ఒక పక్క కొనసాగుతుండగా మరో పక్క సీఎం శాంతి భద్రతలపై సమీక్ష అంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. డీజీపీతో పాటు శాంతిభద్రతల పోలీసు ఉన్నతాధికారులు సీఎం సమీక్షకు హాజరవ్వడానికి ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ సీఎం సమీక్ష వ్యవహారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున సమీక్షలు నిర్వహించరాదనే విషయాన్ని సీఎంకు తెలియజేయాలని, ఏదైనా సమాచారం కావాలంటే ఇవ్వాలని అనురాధకు సూచించారు. ఆమె ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సమీక్ష రద్దు చేసుకుని ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిపోయారు.

సీఎం రివ్యూలపై నివేదిక కోరాం: ద్వివేది
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారంటూ రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో సీఎం సమీక్షలు నిర్వహించవచ్చా? అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానంగా ద్వివేది నిబంధనలు చూపించారు. శాంతిభద్రతలు క్షీణించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఎన్నికల సంఘం అనుమతితో ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించాలని, మిగిలిన సమయాల్లో అధికారులను పిలిపించుకొని మాట్లాడే అధికారం లేదని ఆ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఈ నిబంధనల కాపీని ఆయన మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు పంపారు. అప్పటికే పోలవరం, సీఆర్‌డీఏలపై సమీక్షలు నిర్వహించిన ముఖ్యమంత్రి.. వివాదం ముదురుతుండటంతో హోం శాఖ సమీక్షను రద్దు చేసుకున్నారు.

ఎన్నికల ఖర్చు రూ.600 కోట్లు
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు రూ.600 కోట్లు వ్యయమైనట్లు ద్వివేది తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.300 కోట్లు భరిస్తున్నాయన్నారు. ఎన్నికల విధుల కోసం రూ.300 కోట్లు, పోలీసు సిబ్బంది కోసం రూ.180 కోట్లు వ్యయమైనట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయాలని, రెమ్యునరేషన్‌పై వివాదాలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు సూచించామని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో వచ్చిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు కోరామని, విధుల్లో తప్పులు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు ఏపీ డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ద్వివేదిని కలిసి ఎన్నికల విధుల్లో ఆర్వోలను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కడా మా ఓటు పోయిందన్న ఫిర్యాదు లేకుండా భారీ పోలింగ్‌ నమోదయ్యే విధంగా ఉద్యోగులందరూ కృషి చేశారని అసోసియేషన్‌ సభ్యుడు పి.బాబూరావు తెలిపారు. కింది స్థాయిలో కొందరికి ఎన్నికల నిర్వహణపై అనుభవం లేకపోవడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, దీనికి ఆర్వోలను బాధ్యులను చేయకుండా ఎవరు పొరపాటు చేస్తే వారిపైనే చర్యలు తీసుకోవాలని కోరారు.

admin