టీడీపీ నేతల గుండాగిరిపై నోటీసులు!!

అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యాన్ని దూషిస్తూ, బెదిరింపులకు దిగిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీసు హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ నాగుల్‌ మీరాకు హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. విజయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారా వీరికి నోటీసులు అందచేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దౌర్జన్యంపై ‘సాక్షి’ పత్రికలో ‘ఐపీఎస్‌పై గూండాగిరి’ శీర్షికన 2017లో కథనం ప్రచురితమైంది. ఇది చదివిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకరరావు దీనిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సాక్షి కథనాన్ని సుమోటోగాగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులందరికీ ఇప్పటికే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, కేశినేని నానికి నోటీసులు అందలేదని ఓ న్యాయవాది వివరించారు. దీంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది.

admin