రూ.లక్ష కోట్లు… జగన్‌పై రాజకీయ ఆరోపణలే! ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ స్పష్టీకరణ రూ.1,500 కోట్లు మాత్రమేనని, రూ.లక్ష కోట్లయితే కానే కాదని!!!

అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నది రాజకీయాల కోసం చేసిన ఆరోపణలేనని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆయన తాజాగా ఓ తెలుగు టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జగన్‌పై రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణ అనేది వాళ్లేదో (రాజకీయ ప్రత్యర్థులు) రాజకీయ ప్రచారం కోసం చేసినట్లుగా ఉందని అన్నారు.

తమకు వచ్చిన ఎవిడెన్స్‌ (ఆధారాలు) మేరకే చార్జిషీట్‌లో పొందుపర్చామని, దాని ప్రకారమైతే రూ.1,500 కోట్లు మాత్రమేనని, రూ.లక్ష కోట్లయితే కానే కాదని పేర్కొన్నారు. జగన్‌పై ఆరోపణలు చేసి, ఎవరో రాజకీయంగా వాడుకుని ఉంటే దానికి తామేమీ చేయలేమని తేల్చిచెప్పారు. వైఎస్‌ జగన్‌పై కేసులు నమోదు చేసి, విచారణాధికారిగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు.

By Y Vasu Naidu JMRTVLIVE AMARAVATHI AP POLITICAL BUREAU.

admin