వైఎస్‌ సంక్షేమ పథానికి 15 ఏళ్లు…సరిగ్గా 15ఏళ్ల క్రితం …వైఎస్సార్‌!!!

JMRTVLIVE AMARAVATHI (AP):

తెలుగునాట కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి జనహిత కార్యక్రమాలకు జీవ ప్రదాతగా.. చిరస్మరణీయంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికార పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా 15 ఏళ్లు. 1,400 కిలోమీటర్ల పైబడి ఆయన చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలు.. ప్రజల ఈతి బాధలను స్వయంగా చూసిన వైఎస్‌.. అధికారంలోకి వచ్చీ రాగానే రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం చేశారు. నాటికి రైతులు బకాయీ పడి ఉన్న రూ.1,250 కోట్ల విద్యుత్‌ బిల్లులను కూడా రద్దు చేశారు.

పాలించింది కొన్నేళ్లే అయినా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్‌ పాలించింది ఐదేళ్ల మూడు నెలలే అయినప్పటికీ పాలనపై తనదైన ముద్రవేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలుచేయడం ఒక ఎత్తయితే ఇవ్వని వాగ్దానాలను సైతం అమలుచేయడం ఆయన ఘనతగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చినదే. ఈ పథకం కింద కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకునే అవకాశం పేదలకు కలిగింది.

చదువుకు భరోసా..
ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ మరో విప్లవాత్మకమైన పథకంగా నిలిచింది. నేటికీ లక్షలాది మంది విద్యార్థులు తమ చదువులను నిరాఘాటంగా కొనసాగించగలుతున్నారంటే వైఎస్‌ తన పాలనలో ఇచ్చిన భరోసాయే కారణం. ఇక ముస్లింలకు తన హయాంలో 4 శాతం విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి ఆ వర్గాల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.

నేటి జలఫలాలు వైఎస్‌ చలవే
వైఎస్‌ సంకల్పించిన మరో అద్భుతమైన పథకం జలయజ్ఞం. ఆయన హయాంలో చిన్నా, చితకా 48 ప్రాజెక్టుల వరకూ ఎంపిక చేసి వాటన్నింటినీ సాకారం చేయాలని సంకల్పించారు. నాడు ఆయన వేసిన పునాదులు, 80 శాతం వరకూ చేసిన వివిధ ప్రాజెక్టులూ నేటికి పూర్తయి జలఫలాలను ఇస్తున్నాయి. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా కుల, మత, వర్గ, ప్రాంతీయ వివక్ష లేకుండా అందరికీ వర్తించేలా రూపకల్పన చేశారు. అందుకే నాటి తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలుచేసిన విధంగానే తాను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తానని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘మనకు కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, వర్గం ఉండదు.. అర్హులైతే చాలు వారికి సంక్షేమ పథకాలు అందుతాయి’ అని వైఎస్‌ జగన్‌ ప్రజల్లోకి వెళ్లారు. మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రాజన్న స్వర్ణ యుగం వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో 2004 మే 14 తేదీ మరిచిపోని రోజు. అదే రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అభివృద్ధికి నిర్వచనం చెప్పినవాడు, సంక్షేమానికి తానే సంతకమైన వాడు… అధికారం చేపట్టడానికి ముందు ప్రజాక్షేత్రాన్నే ప్రయోగశాల చేసుకొని, జనహితమే మూల సూత్రంగా పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. తెలుగునేలపై రాజకీయ చిత్రాన్నే సమూలంగా మార్చిన రోజు 14 మే 2004. సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నవశకానికి నాందీపలికారు.

డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టేనాటికి రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, నిబద్ధతతో చేసిన పాద‌యాత్ర ఆయనను ఆవిష్కరించిన తీరు, అధికారం చేపట్టిన తొలి నిమిషాల నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా పద్ధతులు, రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసిన పరిస్థితి… ఇవన్నీ తెలుగునాట మరుపునకు రాని ఓ చరిత్ర! ప్రజాస్వామ్య పాలనకు ఓ సువర్ణాధ్యాయం. ఇతర పాలకులంతా లంకె కుదరటం కష్టమనుకునే అభివృద్ధి–సంక్షేమం జోడు గుర్రాల స్వారీ సాగిన స్వర్ణయుగమది! రాష్ట్రమేదైనా.. తదుపరి పాలకులకు వైఎస్సార్‌ పరిపాలనే ఓ ‘బెంచ్‌మార్క్‌’ అన్న భావన స్థిరపడింది. అర్ధంతరంగా ఆయన తనువు చాలించినా.. పలువురు పాలకులు మారినా.. ఈనాటికీ ఆయన చేసిన పనులే జనం మనోఫలకంపై చెరగని ముద్రలు.

ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం
సరిగ్గా పదిహేనేళ్ల క్రితం, మే 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మార్పుకు ఓ తొలి పొద్దుపొడుపు. అప్పటి దాకా దశాబ్ధాల పాటు కనిపించని, కనివినీ ఊహించని సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆ రోజు ముహూర్త వేళ. ఆ అడుగుల ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సువర్ణ అధ్యాయం. జనం నుంచి వచ్చిన నాయకుడు వైఎస్సార్‌. ప్రజల మనస్సుల్లో నమ్మకమైన నాయకుడిగా నిలిచినవాడు వైఎస్సార్‌. ప్రజల ప్రేమాభిమానాలతోనే ఆయన సీఎం అయ్యారు. రాజకీయ పోరాటాలు, సుదీర్ఘ నిరీక్షణ…అన్నింటి మధ్య నుంచి వైయస్‌ఆర్‌ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా దూసుకొచ్చారు.

ఓ చెరిగిపోని సంతకం
2004 నుంచి 2009 వరకు వైఎస్సార్‌ ఐదేళ్ల పాలన .. విశాలాంధ్ర ప్రదేశ్‌లో ఓ చెరిగిపోని సంతకం. రాష్ట్రం విడిపోయినా..రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్‌ అభిమానులు ఉన్నారు. ఆయనకు రుణపడి పోయామని చెప్పేవారు ఉన్నారు. ఈ రోజు మా బతుకుల్లో కనిపిస్తున్న వెలుగు వైఎస్సార్‌ పుణ్యమే అనే వారు ఎందరెందరో. నిజంగా వైఎస్సార్‌ రాజకీయ నాయకుల్లో అదృష్టవంతుడు. కోట్లాది మంది జనం ఇప్పటికీ ఆయనను తలుచుకోవడం అంటే ఎవరైనా ఆలోచించాల్సిందే. ప్రజల జీవితాలను, మరీ ముఖ్యంగా పేదల జీవితాలపై ఎనలేని ప్రభావం చూపిన వైఎస్సార్‌ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆయనను మరిచిపోని రాజన్నగా చేశాయి. రాజకీయ నాయకుల్లో పుణ్య పురుషుడిని చేశాయి.
By Y Vasu Naidu JMRTVLIVE AMARAVATHI AP POLITICAL…..

admin