రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక…!!!

అమరావతి : సాధారణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునేందుకు ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల సందర్శనపై ఆసక్తి చూపుతూ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ నుంచి కేరళలోని గురువాయూర్‌ ఆలయ దర్శనానికి బయలుదేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేసుకుని ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు.

ఈ మధ్యలో ప్రధాని మోదీ మాల్దీవుల్లో జరిగే విదేశాంగ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా రేణిగుంట చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొలంబో నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని రాకను పురస్కరించుకుని విమానాశ్రయానికి అతి సమీపంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు విజయోత్సవ సభగా నామకరణం చేస్తున్నట్టు తెలిపారు. సభ అనంతరం ప్రధాని స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారని చెప్పారు.

By Y Vasu Naidu JMRTVLIVE AMARAVATHI AP POLITICAL BUREAU…

admin