సీఎం జగన్‌ తొలి సంతకం…!! మూడు ఫైళ్లపై సీఎం జగన్‌ సంతకాలు!!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం సచివాలయానికి చేరుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆయన సచివాలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. వేదపండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి.. ఉదయం 8.39 గంటలకు తన ఛాంబర్‌లో సీఎం అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన తన చాంబర్‌లోని కుర్చీపై ఆసీనులయ్యారు.

మూడు ఫైళ్లపై సీఎం జగన్‌ సంతకాలు
సచివాలయంలోకి అడుగుపెట్టి.. ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించిన అనంతరం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆశావర్కర్ల జీతాలను రూ. మూడు వేల నుంచి రూ. 10వేలకు పెంచుతూ.. తొలి సంతకం చేశారు. అనంతరం ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ ఫైల్‌పై సీఎం జగన్‌ మూడో సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్‌, ధనుంజయరెడ్డి, ఇతర అధికారులు, వేదపండితులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నందిగం సురేశ్‌, ఆదిమూలపు సురేశ్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం తదితరులు సీఎం వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు.

తాడేపల్లి నుంచి సచివాలయానికి..
అంతకుముందు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన సెక్రటేరియట్‌కు చేరుకున్నారు. సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులోని సీఎం కార్యాలయంలోకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తొలిసారి ప్రవేశించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘంతో ఆయన సమావేశం కానున్నారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చినఅప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా హాజరవుతారు.

By Y Vasu Naidu JMRTVLIVE AMARAVATHI AP POLITICAL BUREAU….

admin